Telugu News

ఖమ్మం కాంగీ‘రేస్’లో ఎవరు..?

ఆశీస్తున్నది 10మంది..రేసులో ‘ఆ ఇద్దరు’

0

ఖమ్మం కాంగీ‘రేస్’లో ఎవరు..?

== కాంగ్రెస్ లో ‘సీట్’ఆట

== ఆశీస్తున్నది 10మంది..రేసులో ‘ఆ ఇద్దరు’

== పదేళ్లుగా పార్టీని నమ్మిన జావిద్..

==  పొంగులేటిని నమ్మిన మువ్వా

== తుమ్మల అయితే బెటర్ అంటున్న అనుచరులు

== ఆయోమయంలో పొంగులేటి

== అంతర్మథనంలో పార్టీ శ్రేణులు

== ఖమ్మం బరిలో ఎవరు..?

ఖమ్మం కాంగ్రెస్ లో కలవరం మొదలైందా..? సీటు కోసం నేతలు కుస్తిపడుతున్నారా..?  నేతల అండతో  దూకుడు పెంచారా..? సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికల ప్రచారం ప్రారంభించారా..? అశావాహులు దస బార్ అయితే.. రేసులో ఉన్నది ఆ ఇద్దరేనా..? అందులో బరిలో నిలిచేదేవ్వరు..? గెలిచేదేవ్వరు..? మంత్రిని ఢీకొట్టేదేవ్వరు..? అగ్రనేతల సంగతేంటి..?  ఖమ్మం సీటుపై కాంగీ‘రేస్’ పై విజయంప్రతినిధి అందిస్తున్న పొలిటికల్ స్టోరీ మీకోసం..

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం కాంగ్రెస్ లో కలవరం మొదలైనట్లు కనిపిస్తోంది.  రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలుపే లక్ష్యంగా అడుగులేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఆయా నియోజకవర్గంలో బరిలో నిలిచేందుకు ఆశావాహులు సర్వం సిద్దమవుతున్నారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే బలమైన ప్రత్యర్థిగా ఉన్న రాష్ట్ర రావాణాశాఖ మంత్రి ఖమ్మం నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో ఆ నియోజకవర్గానికి కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు కీలక నాయకులు వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది..

ఇది కూడా చదవండి:- ఓ నేత.. కార్యకర్త గోస వినవా..?

ఖమ్మం నియోజకవర్గంలో ప్రజల్లోకి వెళ్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఢీకొట్టే నాయకుడు లేడనే ప్రచారం జరుగుతుంది. ఆయన్ను ఢీకొట్టాలంటే కచ్చితంగా బలమైన నాయకుడు కావాలనే ఆలోచనతో ఖమ్మం ప్రజలు ఉన్నారు.. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఆ బలమైన నాయకుడేవ్వరు..? అనేది అర్థం కానీ పరిస్థితి అయింది. జనబలం కల్గిన నాయకులు ఇప్పటికే కొందరు పార్టీలో చేరినప్పటికి వారు ఇతర నియోజకవర్గాలు చూసుకుంటున్నారు.. ఖమ్మం వైపు చూసే పరిస్థితి కనిపించడం లేదు.. దీంతో ఖమ్మం కాంగీ రేసు కు బరిలో ఎవరు..? అనే సందేహం ప్రజల్లో నెలకొంది.. ఈ ప్రశ్నకు సమాధానమిచ్చే  పరిస్థితుల్లో కానీ, ఆ పరిస్థితి రాకుండా చేసే పరిస్థితి కాంగ్రెస్ నేతలు కల్పించడం లేదు..

== ఆశావాహులు దస్ బార్.. రేసులో ఆ ‘ఇద్దరు’

ఖమ్మం నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు దస్ బార్ అన్నట్లుగా పదిమంది దరఖాస్తులు చేసుకున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరుచూరి మురళీ క్రిష్ణ, డాక్టర్ లోకేష్ యాదవ్ గంగదేవుల, మానుకొండ రాధాకిషోర్, షేక్ చోటాబాబు, నున్నా రామక్రిష్ణ, పుచ్చకాయల వీరభద్రం, మువ్వా విజయ్ బాబు, మహ్మద్ జావిద్ లు దరఖాస్తు చేసుకున్నారు.

ఇది కూడా చదవండి:- ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్

ఇందులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక్కరే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, మువ్వా విజయ్ బాబు, నున్నా రామక్రిష్ణ, మానుకొండ రాధాకిషోర్, పరుచూరి మురళీ క్రిష్ణ లు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. అలాగే మహ్మద్ జావిద్, చోటాబాబా లు ముస్లీం, మైనార్టీ   సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, పుచ్చకాలయ వీరభద్రం, డాక్టర్ లోకేష్ యాదవ్ లు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. అయితే మొత్తం 10 మంది దరఖాస్తులు చేసుకుంటే అందులో కేవలం ఇద్దరు పేర్లు మాత్రమే బయట ప్రచారం జరుగుతుంది. పదేళ్లుగా పార్టీని నడిపించుకుంటూ, కార్యకర్తలకు అండగా ఉంటూ ఖమ్మం టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్న మహ్మాద్ జావిద్, అలాగే మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి.  మహ్మద్ జావిద్ కు  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అండదండలు ఉండగా, మువ్వా విజయ్ బాబుకు పొంగులేటి అండ ఉంది. పొంగులేటి కోరిక మేరకు మువ్వా విజయ్ బాబు ఖమ్మం నియోజకవర్గానికి దరఖాస్తు చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.

== ప్రచారం షూరు చేసిన ఆ ఇద్దరు  నేతలు

ఖమ్మం నియోజకవర్గంలో పోట చేసే యోచనలో ఉన్న మహ్మద్ జావిద్, మువ్వా విజయ్ బాబు లు రంగంలోకి దిగారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇద్దరు వేరువేరుగా, అప్పడుప్పుడు కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. మహ్మద్ జావిద్ గత మూడేళ్ల నుంచే భారత్ జోడో యాత్ర, వాడవాడకు కాంగ్రెస్, డివిజన్లలో కాంగ్రెస్ యాత్ర, ఇంటింటా ప్రచారం, వాకర్స్ తో కాంగ్రెస్ మాట ముచ్చట, ముస్లీంలతో అలయ్ బలయ్ లాంటి అనేక  కార్యక్రమాల ద్వారా పట్టణంలో, రఘునాథపాలెం మండలంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. అన్ని వాడ్లలో పాదయాత్ర చేశారు.

ఇది కూడా చదవండి:- జమిలి ఎన్నికలు సాధ్యమేనా..?

ప్రజల్లోకి వెళ్లారు. ముఖ్యంగా ముస్లీం మైనార్టీల అండ జావిద్ కు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.. అలాగే మువ్వా విజయ్ బాబు గత మూడు రోజులుగా ఖమ్మం నగరంలో వాడవాడకు కాంగ్రెస్ ప్రచారం ప్రారంభించారు. ఇద్దరు నాయకులు నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏం చేస్తుంది, బీఆర్ఎస్ ప్రజలకు ఏం చేసిందనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లున్నారు.  అయితే ఈ ఇద్దరు మంత్రిని ఢీకొట్టగలరా.? అంటే.. సమాధానం ప్రశ్నార్థికమే..?

== ఆ ఇద్దరు నేతల సంగతేంటి..?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనబలం, రాజకీయ బలం కల్గిన ఇద్దరు నేతలు అధికార పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా, అతి కొద్ది రోజుల్లోనే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మం బీఆర్ఎస్ టార్గెట్ ‘ఆ ఇద్దరే’నా..?

అయితే ఈ ఇద్దరు నేతలు మంత్రిని ఢీకొట్టే విషయంలో ముందుంటారనేది ప్రజల అకాంక్ష.  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేదంటే తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గంలో పోటీ చేస్తే మంత్రిని ఓడించే అవకాశం ఉంటుందని, లేదంటే ఖమ్మంలో బలపడిన పువ్వాడ ను ఓడించడం కష్టమని ప్రజలు చెబుతున్నారు. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం మూడు జనరల్ సీటులో దరకాస్తు చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలనే కన్ప్యూజన్ లోకి నెట్టేశారు. ఆయనకు ఇష్టమైన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కూడా చెప్పే పరిస్థితి లేదు. మూడు నియోజకవర్గాలో ముమ్మరంగా కార్యక్రమాలు చేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే కొత్తగూడెం లేదంటే పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అనుచరులు కూడా అదే చెబుతున్నట్లు సమాచారం. ఇక పీసీసీ విషయానికి వస్తే ఎన్నికల ప్రచార కో చైర్మన్ గా పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి పాలేరు నుంచి పోటీ చేసి ఉమ్మడి జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో పాల్గొంటే పాలేరుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా, రాష్ట్రంలో మరికొన్ని నియోజకవర్గాలను గెలుచుకునే అవకాశం ఉంటుందని పార్టీ భావిస్తోంది. అంతే కాకుండా పొంగులేటి అనుచరులు కూడా అదే విషయాన్ని చెబుతునట్లు సమాచారం. ఖమ్మంలో పోటీ చేసి టెన్షన్ పడేదాని కంటే పాలేరు లేదా కొత్తగూడెం వెళ్తేనే బాగుంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక తుమ్మల నాగేశ్వరరావును కూడా ఖమ్మం నియోజకవర్గంలో పోటీ చేస్తే మంత్రిని ఓడించే అవకాశం ఉంటుందని అందరు భావిస్తున్నారు. కానీ తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఓడిన చోటే గెలవాలనే పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సారి పాలేరు నుంచి పోటీ చేసి గెలవాలనే లక్ష్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది..

ఇది కూడా చదవండి:- ఖమ్మంలో అభయ ‘హస్తం’ ఎవరికో..

కానీ ఆయన సామాజిక వర్గ నాయకులు, కొందరు విశ్లేషకులు పాలేరు కాకుండా ఖమ్మంలో పోటీ చేస్తే ఖమ్మంతో పాటు పాలేరు ను కూడా గెలిపించే అవకాశం ఉంటుందని సలహాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ తుమ్మల ముమ్మాటికి పాలేరు టిక్కెట్ ను మాత్రమే కాంగ్రెస్ అధిష్టానాన్ని అడుగుతన్నట్లు సమాచారం. ఇక అతి త్వరలో పార్టీలో చేరబోతున్న వైఎస్ షర్మిళ కూడా పాలేరు నియోజకవర్గంపై కన్నేశారు. ఆమె ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన విషయం కూడా పాఠకులకు తెలిసిందే. అయితే అతిరథమహారాజులు అందరు పాలేరు నియోజకవర్గాన్ని వెంచుకుంటే, మరీ ఖమ్మంలో పోటీ చేసేదేవ్వరు..? మంత్రిని ఢీకొట్టేదేవ్వరు..? కాంగ్రెస్ ను గెలిపించేదేవ్వరు..? అంటూ రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఖమ్మం నియోజకవర్గానికి ముస్లీం, మైనార్టీ నుంచి మహ్మాద్ జావిద్ వైపు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది..

ఇది కూడా చదవండి:- జమిలి ఎన్నికలు సాధ్యమేనా..?

మరీ ప్రజల అభిష్ఠం మేరకు నాయకులు పోటీ చేస్తారా..? నాయకుల స్వంత నిర్ణయాలను అమలు చేసుకుంటారా..? రాబోయే ఎన్నికల్లో తెలుస్తోంది.. చూద్దాం ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో..?