Telugu News

గర్జించిన 24 గంటలలోపే..

వ్యవసాయ చట్టాలా ఉపసంహరణ..

0

గర్జించిన 24 గంటలలోపే..
వ్యవసాయ చట్టాలా ఉపసంహరణ..

(హైదరాబాద్ – విజయం న్యూస్):-

కేంద్ర ప్రభుత్వ చట్టాలతో అన్నదాతల బతుకులు ఆగమైపోయాయి. ఢిల్లీ రాజధానిలో ఏడాది కాలంగా లక్షల మంది రైతులు ధర్నా చేస్తున్నా కేంద్రం వారి మొరను ఆలకించడం లేదు.

అవసరం అనుకొంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రైతాంగ సమస్యల కోసం తానే లీడర్‌షిప్‌ తీసుకుంటుంది. ముందుకు పోతుంది. మీ మెడలు గ్యారంటీగా వంచుతుంది. మీ కుటిల నీతి..మీ దుర్మార్గమైన విధానాలు, మీ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా చివరి రక్తపు బొట్టుదాకా పోరాటం చేస్తాం తప్ప మిమ్ములను వదిలిపెట్టం.

‘నేను ప్రధాని మోదీని సూటిగా అడుగుతున్నా. ఈ సభలో మీ సీఐడీలు ఉన్నరు. నేను మాట్లాడే మాట పావుగంటలో మీ టేబుల్‌ మీదకు వస్తది. ఆ విషయం నాకు తెలుసు. – గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో ప్రభుత్వ ధర్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌.

నా నోటి కాడ బుక్కను.
నాణ్యంగా కాజేసిన. నాగరికుడా విను!
నా నాగటి చాలులోన.. నాజూకుగ పవ్వళించి.
నను కాటేసిన..
నాగరికుడా విను! అని ప్రజా కవి కాళోజీ అన్నట్టు.

ఢిల్లీ పాలకులకు భారతీయ రైతు కర్రు కాల్చకుండానే వాతపెట్టాడు! మొలకెత్తే విత్తనమేదో, మకిలి చిత్తమేదో తనకు తెలుసునని తేల్చి చెప్పాడు! నాటు వేయడమే కాదు; కాటేసే శక్తులను మాటు వేసి మంత్రించగలననీ చాటి చెప్పాడు! కోపం లేదు, కొట్లాట లేదు.. దేశ రాజధాని శివార్లలో శిబిరాలు తప్ప! పొలం లేదు, పరివారం లేదు.. ఎండావానల్లో పరితాప జీవనం తప్ప! ఒకటికాదు, రెండు కాదు, ఏకంగా ఏడాది కాలం.. మాట మీరలేదు.. కాలు కదలలేదు. కత్తి దూయలేదు! కానీ అనుకున్నది సాధించాడు. దేశ రైతాంగానికి పిడుగుపాటులా మారిన వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం మెడలు వంచాడు.

ఇది సత్యాగ్రహం కాదు; దాన్ని మించిన ధర్మాగ్రహం. అన్నం పెట్టే రేవును తలవని అహంభావాలను అణచివేసిన
శాంత ధిక్కారం! తూట్లు పూడ్చి తూములు తెరిచినట్టు రైతును దోచి కార్పొరేట్లకు కట్టబెట్టే పాలకుల కనికట్టుకు రైతు ఆటకట్టన్నాడు!!

రైతు సమస్యలపై, కేంద్ర వ్యవసాయ చట్టాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమర శంఖం పూరించి, హైదరాబాద్‌లో భారీ ధర్నా నిర్వహించి, జాతీయ రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తామని ప్రకటించి, 24 గంటలైనా గడవకముందే.. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించడం యాదృచ్ఛికం కాదు. తెలంగాణ వడ్లు కొననన్న కేంద్రం వివక్షను విస్పష్టం చేస్తూ కేసీఆర్‌.. బీజేపీ ప్రభుత్వ వ్యవసాయ విధాన డొల్లతనాన్ని జెండాకెక్కించారు. దేశంలో సాగు దౌర్భాగ్యానికి బాధ్యత ఎవరిదని నిలదీశారు.

ఉత్తరాది రైతు ఉద్యమం దక్షిణాదికీ విస్తరిస్తున్నదన్న భయం, వ్యవసాయ చట్టాలపై మిత్రులంతా దూరమై ఒంటరిగా మిగిలిన వైనం, రైతు కేంద్రంగా అన్ని పార్టీలూ ఏకమవుతాయేమోనన్న ఆందోళన, యూపీ- పంజాబ్‌ ఎన్నికల్లో దెబ్బతినే ప్రమాదం.. అన్నీ కలగలసి మోదీలో ప్రాప్తకాలజ్ఞతకు కారణమయ్యాయి. వ్యవసాయ చట్టాల రద్దుకు దారితీశాయి. అయితే నాడు తెలంగాణ ఉద్యమంలోనైనా, నేడు రైతు ఉద్యమంలోనైనా వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాతే కేంద్రానికి కనువిప్పు కలగడం విషాదకరమైన విషయం.!

దేశ రైతాంగ సమస్యలపై దక్షిణాది ముఖ్యమంత్రి ఒకరు ధైర్యంగా, బహిరంగంగా ఢిల్లీ పాలకులకు తాఖీదు ఇవ్వడం ఇదే మొదటిసారి.

ఇన్నేండ్ల రాజకీయ జీవితంలో నరేంద్ర మోదీ ఒక నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం, క్షమాపణ చెప్పడం కూడా ఇదే మొదటిసారి!!

మట్టి పాన్సున మిసిమి మబ్బు కలలను అన్నదాత.. కేంద్ర సర్కార్ మెడలు వంచి.. ఢిల్లీ దర్బార్‌ను తన చేనుచెంతకు లాక్కొచ్చి.. పొలంలో మోకరిల్లజేయడమూ చరిత్రలో ఇదే మొదటిసారి!!

 

also read:-తెగిపోయిన అన్నమయ్య చెరువు*