Telugu News

’మినరల్ ‘ దందా!

అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వాటర్ ప్లాంట్ల ఏర్పాటు కానరాని నీటి శుద్ధి.. జోరుగా నీటి విక్రయాలు.

0

(మణుగూరు రూరల్-విజయం న్యూస్) :

మారుతున్న ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు మినరల్ వాటర్ కు అలవాటు పడటంతో మణుగూరు మండలం లో వాటర్ ప్లాంట్ నిర్వాహకులు మినరల్ వాటర్ పేరుతో జనరల్ వాటర్ సప్లై చేస్తూ అక్రమ దందా సాగిస్తున్నారు వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అనే చందంగా తయారైంది. నీటి వ్యాపారం వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. మండలంలోని వివిధ గ్రామాల తో పాటు మణుగూరు మున్సిపాలిటీ పట్టణంలో మినరల్ వాటర్ పేరుతో ఎక్కడపడితే అక్కడ ప్లాంట్లను ఏర్పాటు చేసి నీటి వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొందరు వ్యాపారులు కనీస నిబంధనలు, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, కాసులకు కక్కుర్తిపడి ఇష్టారాజ్యంగా ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ ప్రజలను నిలువుగా దోచుకుంటున్నారు. పుట్టగొడుగుల్ల. ప్లాంట్లు నెలకొల్పి ప్రజారోగ్యం గాలికొదిలేసి, ధనార్జనే ధ్యేయంగా, యధేచ్ఛగా మినరల్ వాటర్ పేరుతో దందా సాగిస్తున్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం మినరల్ వాటర్ ప్లాంట్ నెలకొల్పాలంటే స్థానిక పంచాయతీ, మున్సిపాలిటీ అనుమతులు తప్పని సరిగా తీసుకోవాలి, ప్రతి వాటర్ ప్లాంట్ బి ఐ ఎస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి, వాల్టా చట్టం ప్రకారం బోరు అనుమతులు పొందాల్సి ఉంటుంది, ప్రజారోగ్య ఆహార భద్రత తూనికలు కొలతలు కార్మిక శాఖ నుండి వివిధ అనుమతులు పొందాల్సి ఉంటుంది. కానీ అలా జరగడం లేదు. ప్రతి క్యాన్ పై తయారు చేసిన తేదీ, బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ తేదీ ఖచ్చితంగా ముద్రించాలి, డబ్బాలో నీళ్లు ముందు శుభ్రం చేయాలి, ఒక్కో క్యాన్ ను 30 నుండి 50 సార్లు మాత్రమే వినియోగించాలి. ఈ నియమ నిబంధనలను గాలికొదిలేసి యదేచ్ఛగా, నిర్లజ్జగా నీటి వ్యాపారం చేస్తున్నారు.
నీటి శుద్ధి ఎక్కడ ?

మినరల్ వాటర్ ప్లాంట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పని చేస్తే ప్రతి ఐదు వేలు లీటర్ల నీటిని అభివృద్ధి చేసేందుకు 20 వేల నుంచి 25 వేల లీటర్ల వృధా నీరు బయటకు వస్తుంది. నిబంధనల మేరకు వృధా నీటిని తిరిగి భూమిలోనికి ఇంకేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ప్లాంట్ నిర్వాహకులు ఇవేమి పట్టించుకోకుండా, నీటిని మురుగు కాలువల లోనికి వదలడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఏర్పడింది. జనా వాసాల మధ్య ప్లాంట్ల ఏర్పాటు, మణుగూరు మండలం లో మినరల్ వాటర్ కు మంచి డిమాండ్ ఉండటంతో ఇళ్ల మధ్యలో బోర్లు వేస్తూ నీటి దందా సాగిస్తున్నారు. అశోక్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, గుట్ట మల్లారం, రామానుజవరం, సంతోష్ నగర్ తో పాటు, గల్లీకో ప్లాంట్ ను ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకొని నీటి వ్యాపారం సాగిస్తున్నారు.

ప్రజా ఆరోగ్యాలను పట్టించుకునే మినరల్ వాటర్ ప్లాంట్లను పర్యవేక్షించాల్సిన అధికారులు కనీసం ప్లాంట్ల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.నీటి అక్రమ దందా సాగిస్తున్న వాటర్ ప్లాంట్లపై చర్యలు చేపట్టాల్సిన అధికారులు మిన్ను కుండి పోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల అండదండలతోనే యధేచ్ఛగా మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని లక్షలాది రూపాయల నీటి వ్యాపారం సాగిస్తూ, లక్షలు గడిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 25 లీటర్ల నీటి కాన్ కు ప్రస్తుతం 15 ,20 రూపాయలు తీసుకుంటుండగా మార్చి నెలలో మంచినీటి డిమాండ్ ఉండటంతో రూ 40 నుండి 50 వరకు వసూలు చేస్తూ ప్రజలను నిలువుగా దోచుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు అక్రమ దందా సాగిస్తున్న ప్లాంట్లను పరిశీలించి, చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.